Farmers: పురుగు మందే పెరుగన్నం..కన్నీరే చివరకు మిగిలేది..! 8 d ago

మేము వారి కష్టాలు విన్నాము..
మేము వారి బాధలు చూశాము..
అందుకే రాశాము గుండెతరుక్కుపోయే ఈ కథ..
వారి బాధ చూసి ఆ నాగలి ఉరేసుకుంది..
వారి బాధ చూసి వరుణుడు గొంతు కోసుకున్నాడు..
వారి బాధ చూసి నదులు కన్నీరు పెడుతున్నాయి..
వారి బాధ చూసి నేల తల్లి గుండె పగిలిపోయింది..
వారి బాధ చూసి ఆ జోడెద్దులు ఆత్మహత్య చేసుకున్నాయి..
రైతుల బాధలపై స్పెషల్ న్యూస్..
నీకు నేనున్నా అని చెప్పే వరుణుడు ఆ రైతుల బాధ చూసి కన్నీరు పెడుతున్నాడు..
నీకు నేనునా అని చెప్పే నదులు ఆ రైతుల బాధ చూసి కన్నీరు పెడుతున్నాయి..
నీకు ఏమీ చేయలేకపోతున్నా నన్ను క్షమించు అంటూ వరుణుడు కన్నీరు పెడుతున్నాడు..
నీకు ఏమీ చేయలేకపోతున్నా నన్ను క్షమించు అంటూ ఆ నదులు కన్నీరు పెడుతున్నాయి..
నా వల్ల నీకు ఉపయోగం లేదని ఆ నాగలి.. రైతుల బాధ చూసి కన్నీరు పెడుతోంది.
రైతే రాజు అంటారు.. కానీ అది నిజం కాదు.. ఎందుకంటే దేశ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతు రైతుగానే మిగిలిపోయాడు కాబటి.. ఒక్కసారి ఆ రైతు కుటుంబాల బాధలు చూస్తే గుండె చలించిపోతోంది. వారి బిడ్డల బతుకులు చూస్తే ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటారు. ఒక పక్క మండుతున్న ఎండలు. మరోపక్క ఎండిపోతున్న నదీ జలాలు.. ఇంకో పక్క కరుణించని వరుణ దేవుడు. ఇప్పుడు ఇవన్నీ రైతు పాలిట శాపంగా మారాయి. మనందరి కడుపు నిండుతుందంటే దానికి కారణం రైతు. ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా ఆయన చేస్తున్న పనికి మాత్రం సెలవుండదు. రైతు నిరంతర శ్రామికుడు.
ఈ దేశానికి అన్నం పెట్టడానికి రైతు నిరంతరం కష్టం చేస్తుంటాడు. ఎర్రటి ఎండలో.. సలసల మరిగే నేలపై అడుగులు వేస్తూ ఎంత బాధ వచ్చినా దిగమింగుకొని పంటలు వేస్తాడు. కానీ వారు చేస్తున్న కష్టానికి ఫలితం మాత్రం ఉండటం లేదు. వీపరీతమైన ఎండల వలన నదీజలాలు అడుగంటిపోయి రైతుల పంటలకు నీరు అందడం లేదు. ప్రస్తుతం ఇలా ఉంటే వర్షా కాలంలో విపరీతమైన గాలులు, భారీ వర్షాల కారణంగా పంటలు నేలవాలిపోయి పంట చేతికిరాక రైతులు అల్లాడిపోతున్నారు. అంతా బాగుంది ఈ ఏడాది పంట బాగా పండింది అనుకుంటే సరైన గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. పంట పండించిన నష్టమే.. పంట పండించకపోయిన నష్టమే.. మొత్తంగా రైతులకు చివరికీ కన్నీరే మిగులుతుంది.
నెలకు ఎంతో కొంత సంపాదించే మన బతుకులే అంతంత మాత్రంగా ఉంటాయి. కానీ అన్ని విధాలా నష్టపోతున్న రైతు కుటుంబాల బాధలు ఎలా ఉంటాయో తెలుసా. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఉన్నదంతా పంటలపై పెట్టి, ఒక వేళ చాలకపోతే అప్పు చేసి మరి పంటలపై పెడతారు. కానీ పంటలు పండక వాళ్ల జీవితాల్లో మాత్రం ఆనందం లేకుండా పోతుంది. అనుకోకుండా ఆ రైతులకు ఏదైనా అనారోగ్యం వస్తే ఇక అంతే సంగతలు. ఆరోగ్యం చూపించుకోవడానికి చేతిలో చిల్లుగవ్వ ఉండదు. చేసేది ఏమీ లేక వారికి జీవనాధారమైన జోడెద్దులను అమ్ముకుంటున్నారు. ఏ దిక్కులేని వారైతే అప్పులు పాలవుతున్నారు.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇక వారి బిడ్డల పరిస్థితి అయితే మరీ దారుణం. ఇంటి పెద్దను కోల్పోయి, అప్పలు తీర్చలేక, ఉన్నత చదువులు చదువుకోలేక అన్యాయమైపోతున్నారు. ఎంతో కొంత చదువుకున్న వాళ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏమీ చదువుకోని వారైతే కుటుంబ పోషన కోసం రోజు వారీ కూలీలుగా మారిపోతున్నారు. రైతులు ఇన్ని బాధలు పడుతున్నారు అని చెబుతున్న ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకోవడానికి ముందుకు రావు. ఇప్పటికైనా ఆ రైతుల బతుకులు మార్చాలని ఆ దేవుడిని కోరుకుందాం. ఎందుకంటే మనం ఆ దేవుడిని కోరడం తప్ప ఏమీ చేయలేము కదా..